Genesis 44

1యోసేపు, <<వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు, 2చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు>> అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.

3తెల్లవారినప్పుడు ఆ మనుషుల్ని తమ గాడిదలతో పాటు పంపి వేశారు. 4వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో <<నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, <మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి? 5నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం> అని వారితో చెప్పు>> అన్నాడు.

6అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పాడు. 7వారు <<మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.

8చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసికొని వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము? 9నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం>> అని అతనితో అన్నారు. 10గృహ నిర్వాహకుడు, <<మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు>> అని చెప్పాడు.

11అప్పుడు ప్రతివాడు గబగబా తన సంచిని దించి దానిని విప్పాడు. 12ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది. 13వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.

14అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు. 15అప్పుడు యోసేపు <<మీరు చేసిన ఈ పని ఏమిటిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా>> అని వారితో అన్నాడు.

16యూదా <<మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం>> అన్నాడు. 17యోసేపు <<అలా చేయడం నాకుదురమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్ళండి>> అని చెప్పాడు.

18యూదా అతని సమీపించి, <<ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా. 19నా యజమానులైన మీరు, <మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?> అని తమ దాసుల్ని అడిగారు.

20అందుకు మేము, <మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు> అన్నాము. 21అప్పుడు తమరు, <నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరకు తీసికొని రండి> అని తమ దాసులతో చెప్పారు.

22అందుకు మేము, <ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు> అని నా యజమానులైన మీతో చెప్పాము.

23అందుకు తమరు, <మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మరలా నా ముఖం చూడకూడదు> అని తమ దాసులతో చెప్పారు. 24కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరకు మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటల్ని అతనికి తెలియచేశాము. 25మా తండ్రి, <మీరు తిరిగి వెళ్ళి మనకోసం కొంచెం ఆహారం కొనుక్కొని రండి> అని చెబితే 26<మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము> అని చెప్పాము.

27అందుకు తమ దాసుడైన నా తండ్రి, <నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు. 28వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు. 29మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు> అని మాతో చెప్పాడు.

30కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరకు నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే 31మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఖంతో దిగిపోయేలా చేస్తాము. 32తమ సేవకుడినైన నేను, <ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరకు నేనతని తీసికొని రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది>అని చెప్పాను.

33కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవానిని తన సోదరులతో వెళ్ళనివ్వండి. ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది>> అని చెప్పాడు.

34

Copyright information for TelULB